తమిళనాడు బడ్జెట్ సమావేశాలు.. ప్రసంగాన్ని చదవలేనని వెళ్లిపోయిన గవర్నర్

TN Governor RN Ravi Refuses To Read Out Government Speech, Assembly Passes Resolution Declaring Speech Delivered

చెన్నైః తమిళనాడులో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శాసనసభకు వచ్చిన గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి రెండు నిమిషాల్లోనే ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. సాధారణంగా ఈ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలవ్వాల్సి ఉండగా.. తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన గవర్నర్ ఆన్ ఎన్ రవి ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని చదవలేనని స్పష్టం చేశారు. అందులో కొన్ని అభ్యంతరకర విషయాలు ఉన్నాయని అందుకే తాను విభేదిస్తున్నట్లు తెలిపారు. దీంతో గవర్నర్‌కు బదులుగా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని స్పీకర్‌ చదివి వినిపించారు.

“గవర్నర్‌ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయ గీతం ఆలపించాలని నేను పదే పదే చేసిన అభ్యర్థనలను విస్మరించారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలో చెప్పిన చాలా అంశాలను నైతిక కారణాలతో నేను అంగీకరించలేదు. వాటి విషయంలో విభేదిస్తున్నాను. ప్రసంగంలో వాటిని పేర్కొంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. అందుకే ఇంతటితోనే నా ప్రసంగాన్ని ముగిస్తున్నా. ఈ సమావేశాల్లో చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నా.” ప్ర‌జ‌ల కోసం ఆరోగ్య‌క‌ర‌మైన చ‌ర్చ‌లు చేప‌ట్టాల‌ని ర‌వి ఆశాభావం వ్య‌క్తం చేశారు.