తెలంగాణ బిజెపికి షాక్ : మాజీ మంత్రి చంద్రశేఖర్ పార్టీ కి గుడ్ బై

తెలంగాణాలో త్వరలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో బీజేపీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి చంద్రశేఖర్ ఆ పార్టీకి గుడ్ బై చెబుతూ రాజీనామా చేశారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి రాజీనామా లేఖను పంపించారు.

ఈ సందర్భగా ఆయన బీజేపీ, అధికార బీఆర్‌ఎస్ పార్టీలపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. బీజేపీలో చేరి నేతలు మోసపోతున్నారని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు పోటీ అని భావించి అనేకమంది ఉద్యమకారులు బీజేపీలో చేరి భంగపాటుకు గురవుతున్నారని విమర్శలు చేశారు.

తెలంగాణ ప్రభుత్వానికి బీజేపీ వత్తాసు పలుకుతోందని ఆయన విమర్శించారు. పని చేసేవారిని ప్రోత్సహించడం లేదంటూ ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గతంలో చంద్రశేఖర్ టీడీపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో పనిచేశారు. వికారాబాద్‌లో 2021 జనవరి 18న నిర్వహించిన బహిరంగ సభలో అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ సమక్షంలో చంద్రశేఖర్‌ బీజేపీలో చేరారు. ఆ సమయంలో చంద్రశేఖర్‌కు సముచిత స్థానం కల్పిస్తామన్న ముఖ్య నేతల హామీ ఇచ్చారు. అయితే తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, తన తరువాత పార్టీలో చేరిన వారిని జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవడంతో ఆయన మనస్తాపానికి గురై..ఆ పార్టీ నుండి బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.