తన ఆటో ఎక్కితే కేజీ టమాటా ఫ్రీగా ఇస్తున్న డ్రైవర్..

ప్రస్తుతం టమాటా కు ఎంత డిమాండ్ ఉందొ చెప్పాల్సిన పనిలేదు. ఒక్కోసారి రూపాయికి కేజీ కూడా ఉండని టమాటా..ఇప్పుడు ఏకంగా కేజీ రూ.150 పలుకుతుంది. గత నెల రోజులుగా ఇదే ధర నడుస్తుంది. మరికొన్ని రోజులపాటు ఇలాగే ఉంటుందని మార్కెట్ వారు చెపుతున్నారు. దీంతో టమాటా కొనేందుకు సామాన్య ప్రజలు భయపడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం టమాటా ను బాగా వాడుకుంటూ తమ వ్యాపారాన్ని పెంచుకుంటున్నారు. తాజాగా ఓ ఆటో డ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు.

పంజాబ్ చండీగఢ్‌కు చెందిన అరుణ్ అనే ఆటో డ్రైవర్.. ప్రయాణికులను ఆకర్షించేందుకు టమాటాలను ఎంచుకున్నాడు. తన ఆటోలో ప్రయాణించినవారికి కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానని ప్రకటించాడు. కాకపోతే కిలో టమాటాలు ఫ్రీగా ఇవ్వడానికి ఒక కండీషన్ పెట్టాడు. ఎవరైతే తన ఆటోలో కనీసం ఐదుసార్లు ప్రయాణిస్తారో వారికి మాత్రమే కిలో టమాటాలను ఉచితంగా ఇస్తానని తెలిపాడు. ఇంకేముంది ఇది కాస్త వైరల్ గా మారింది. తనకు ఉన్న ఒకే ఒక ఆదాయమార్గం ఆటోనే అని , అలాంటి ఆటో ద్వారా సామాన్యులకు ఇలాంటి సేవలు అందించడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని అరుణ్ పేర్కొన్నాడు.