బీజేపీ నేతల మాటల్లో విషయం లేదు.. అంతా విషమే.. మంత్రి హరీశ్

అవగాహన లేకుండా రాసిచ్చిన స్క్రిప్టును చదివేశారని విమర్శ

Harish Rao

హైదరాబాద్‌: బీజేపీ నేతల మాటల్లో విషం తప్ప.. విషయం లేదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అన్నారు. నిన్నటి బీజేపీ సభపై మంత్రి మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తెలంగాణలో నీళ్లు వచ్చింది నిజం కాదా? అని నిలదీశారు. నీళ్లు వచ్చాయో లేదో ఇక్కడి రైతులను అడిగితే చెబుతారని స్పష్టం చేశారు. ‘‘అమిత్‌షా.. అవగాహన లేకుండా మీ స్థాయిని తగ్గించుకోవద్దు. నీళ్లు వచ్చాయనేందుకు తెలంగాణలో పెద్ద ఎత్తున పండిన పంటలే నిదర్శనం. తెలంగాణ నుంచి లక్ష కోట్ల విలువైన ధాన్యం కొన్నామని ప్రధాని మోడీ అన్నారు. మరి నీళ్లు లేనిదే పంటలు ఎలా పండాయి? అంత ధాన్యం ఎలా కొన్నారు? దేశంలో పంజాబ్‌ తర్వాత ఎక్కువగా వరి పండిస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనని నీతి అయోగ్‌ చెప్పింది. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు సగటున 3 శాతమే ఉంటే.. తెలంగాణలో 10 శాతంగా ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అమిత్ షా బీజేపీ నేతలు తప్పుగా రాసిచ్చిన స్క్రిప్టును చదివినట్టు ఉన్నారు. నీళ్ల గురించి బీజేపీ వాళ్లను కాదు.. అసలైన రైతులను అడగండి చెబుతారు..” అని హరీశ్ రావు స్పష్టం చేశారు.

తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం సరిగా కేటాయించి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ది చెంది ఉండేదని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను సికింద్రాబాద్ సభలో ప్రధాన మంత్రి ప్రకటిస్తారని అనుకున్నామని.. కానీ ఆ ఊసే ఎత్తలేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ కూడా సభలో అబద్ధాలు చెప్పారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

తాజా అంతర్జతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/