ఉబ్జెకిస్తాన్‌లో చిన్నారుల మరణాలపై వివరాలు కోరిన భారత్‌

సిరప్ లో కలుషిత ఇథలీన్ గ్లైకాల్ ఉన్నట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోపణలు

Centre seeks causality status as Uzbekistan links deaths of 18 kids to Indian syrup

న్యూఢిల్లీః ఉజ్బెకిస్థాన్ లో భారత ఫార్మా కంపెనీ దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు మరణించిన ఆరోపణలపై కేంద్ర సర్కారు స్పందించింది. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, అందుకు సంబంధించిన ఆధారాలు, తాజా పరిస్థితిపై సమాచారం (క్యాజువాలిటీ స్టేటస్) ఇవ్వాలని కోరింది.

మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్ 1 మ్యాక్స్ సిరప్‌ను తాగి 18 మంది చిన్నారులు మరణించినట్టు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం ఆరోపించడం తెలిసిందే. వైద్యుల సూచన లేకుండా, ఫార్మసీల నుంచి కొనుగోలు చేసి చిన్నారులకు అధిక మోతాదులో ఇవ్వడం వల్లే ఈ మరణాలు సంభవించినట్టు పేర్కొంది. సిరప్‌లో కలుషిత ఇథలీన్ గ్లైకాల్‌ ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైందని ప్రకటన చేయడం గమనార్హం. దీంతో కేంద్ర సర్కారు పూర్తి వివరాలు తెలుసుకునే పనిని మొదలు పెట్టింది. అనంతరం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

గాంబియాలో 70 మంది చిన్నారులు భారతీయ ఫార్మా కంపెనీ మెయిడన్ ఫార్మస్యూటికల్స్ దగ్గు, జలుబు మందులు తాగి మరణించినట్టు ఆరోపించడం తెలిసిందే. కానీ, కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన పరీక్షల్లో ఆయా దగ్గు, జలుబు మందుల్లో ఎలాంటి హానికారకాలు లేవని వెల్లడైంది. దీంతో భారత ఫార్మా ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతోనే ఆరోపణలు చేస్తున్నట్టు కేంద్ర సర్కారు పేర్కొనడం గమనార్హం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/