తెలంగాణ కు షాక్ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం కరెంట్ షాక్ ఇచ్చింది. 30 రోజుల్లోగా ఏపీకి తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. విభజన తర్వాత 2014-2017వరకూ తెలంగాణ డిస్కంలకు విద్యుత్‌ సరఫరా చేసినందుకు ఏపీకి బకాయిలు చెల్లించాల్సి ఉంది.

ఈ మేరకు రూ. 3,441 కోట్ల ప్రిన్సిపల్‌ అమౌంట్‌, రూ. 3,315 కోట్ల లేట్‌ పేమెంట్‌ సర్‌ చార్జీలు చెల్లించాలి. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల వ్యవధిలో ఏపీకి బకాయిలు చెల్లించాలని కేంద్రం స్పష్టం చేసింది.

రీసెంట్ గా ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్..తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించేలా ఆదేశాలివ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఏపీకి చెందిన పలు అంశాలతోపాటు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు రూ.6,756 కోట్ల బకాయిలు ఉన్నాయని, 8 ఏండ్లుగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని వివరించారు. ఈ మొత్తం ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఒడ్డున పడతాయని, ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించే వీలు కలుగుతుందని చెప్పారు. జగన్ విజ్ఞప్తి మేరకు కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.