పార్లమెంట్ ప్రారంభోత్సవంపై ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

పార్లమెంట్ ప్రారంభోత్సవంపై ప్రధాని మోడీకి టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి, ఈ చారిత్రక పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలుపుకుంటున్నానని వివరించారు. మార్పు దిశగా తీసుకునే విధానపరమైన నిర్ణయాలకు ఈ కొత్త పార్లమెంటు భవనం వేదికగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. భారతదేశంలో ఉన్నవాళ్లు-లేనివాళ్లు అనే అంతరం తొలగిపోవాలన్న స్వప్నం 2047 నాటికి సాకారమవుతుందని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం గురించి రాజకీయాల్లో హాట్ టాపిక్ నడుస్తుంది. రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా ప్రధాని మోడీ పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని.. తాము ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తున్నామని 19 విపక్ష పార్టీలు బుధవారం స్పష్టం చేశాయి. చంద్రబాబు తన సోషల్ మీడియా స్పందనలో .. ఎక్కడా ప్రస్తుతం జరుగుతున్న వివాదంపై స్పందించ లేదు.

ఈ నెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ను ప్రారంభించనున్నారు. కొత్త పార్లమెంట్‌ సిద్ధమైపోయిందని, ఆత్మనిర్భర్ భారత్‌కి ఇది ప్రతీకగా నిలిచిపోతుందని గతవారమే లోక్‌సభ ఓ ప్రకటన చేసింది. 2020 డిసెంబర్ 10వ తేదీన ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మోదీ. అయితే…కొవిడ్ కారణంగా పనులు ఆలస్యమయ్యాయి. 2021 జనవరిలో నిర్మాణం మొదలైంది. అహ్మదాబాద్‌కి చెందిన HCP Design Planning and Management ఈ బిల్డింగ్‌ని డిజైన్ చేసింది. ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ దీన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం ఉన్న పార్లమెంట్‌ పక్కనే Tata Projects Limited ఈ నిర్మాణాన్ని చేసింది.