బిజెపికి మమతా బెనర్జీ సవాల్

దమ్ముంటే ముందు నన్ను అరెస్ట్ చెయ్యండి అంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ బిజెపి కి సవాల్ విసిరారు. ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడానికి కేంద్ర ఏజెన్సీలను ఆయుధంగా బిజెపి కేంద్రం వినియోగిస్తుందని ఆమె మండిపడ్డారు.

కోల్‌కతాలో టీఎంసీ విద్యార్థి విభాగం నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆమె అన్నారు. బీజేపీ ప్రతి ఒక్కరిపై దొంగలని ముద్ర వేస్తోందని విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నవారంతా దొంగలని, కేవలం బీజేపీ, మత నేతలు మంచివారుగా కాషాయ పార్టీ ప్రచారం చేస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలని దుర్వినియోగం చేస్తోందని, అక్రమంగా సాధించిన డబ్బుతో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలదోసేందుకు ఉపయోగిస్తుందని మమతా అన్నారు.

“వీలైతే నన్ను అరెస్టు చేయమని సవాల్ చేస్తున్నాను… బీజేపీ అందరిని దొంగలుగా ముద్ర వేస్తోంది. టీఎంసీలోని మేమంతా దొంగలమని, బీజేపీ నేతలు మాత్రమే పవిత్రులమంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో ఉన్నట్లయితే నేను వారి నాలుకను తెగ్గొసేదానిని” అని మమతా బెనర్జీ అన్నారు.