బిఆర్ఎస్ పార్టీ కి షాక్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై కేసు నమోదు

బిఆర్ఎస్ పార్టీ కీ వరుస షాకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఓ పక్క కీలక నేతలంతా పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరుతుంటే..మరోపక్క ఉన్న నేతలపై పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి. నార్సింగిలో భూవివాదంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. కోకాపేటలోని సర్వే నంబరు 85లో 2 ఎకరాల 30 గుంటల భూమిపై పెట్టుబడిదారులు, డెవలపర్‌ మధ్య వివాదం నెలకొంది.

దీన్ని పరిష్కరించుకోకుండా డెవలపర్‌ నిర్మించిన తాత్కాలిక గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు వారి అనుచరులు ఖాళీ చేయించారని డెవలపర్‌ ప్రతినిధి గుండు శ్రవణ్‌ గురువారం రాత్రి ఫిర్యాదు చేయగా.. అదేరోజు పోలీసులు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోకాపేటలోని సర్వేనంబరు 85లోని స్థలాన్ని గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ కొద్ది నెలల నుంచి అభివృద్ధి చేస్తోంది. అయితే, గోల్డ్‌ఫిష్‌ సంస్థతో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డికి కొన్ని నెలలుగా వివాదం కొనసాగుతున్నట్టు గోల్డ్‌ ఫిష్‌ అడోబ్‌ సంస్థ ప్రతినిధి గుండు శ్రవణ్‌ తెలిపారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి దాదాపు 60 మందికిపైగా కోకాపేటలోని స్థలానికి వచ్చారు. గుడిసెల్లో నివాసముంటున్న కూలీలను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్సీ అనుచరులు కూలీల తట్టా, బుట్టా బయటకు విసిరేయడమే కాకుండా గర్భిణులపై దురుసుగా ప్రవర్తించారు. ఈ లోపు సమాచారం అందుకున్న నేను అక్కడికి వెళ్లగా.. నాపైనా దాడి చేసారని తెలిపారు.