అన్నాడీఎంకే సురక్షిత చేతుల్లో లేదు..తమిళనాడు అంతటా పర్యటిస్తా: శశికళ

అందరం కలిసి పార్టీకి పూర్వ వైభవాన్ని తిరిగి తెస్తామని వెల్లడి

AIADMK not in safe hands, says VK Sasikala, vows to restore ‘former glory’

చెన్నైః అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభంపై ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ స్పందించారు. పార్టీ ప్రస్తుతం సురక్షితమైన వారి చేతుల్లో లేదని అన్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు అంతటా పర్యటిస్తానని వెల్లడించారు. మాజీ సీఎం జయలలిత 75వ జయంతి సందర్భంగా ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశికళ పలు విషయాలను వెల్లడించారు.

పార్టీకి క్యాడర్ చాలా ముఖ్యమని, కార్యకర్తలే బలమని అన్నారు. 100 లేదా 200 మందితో పార్టీని నడపలేరని చెప్పారు. ‘‘త్వరలోనే.. ప్రతి ఒక్కరూ కలిసి పని చేస్తారు. పార్టీకి పూర్వ వైభవాన్ని తిరిగి తెస్తారు. 2024 ఎన్నికల కోసం అందరం పని చేస్తాం’’ అని శశికళ వెల్లడించారు.

జయలలిత చనిపోయారని తనకు ఎప్పుడూ అనిపించ లేదని, ఆమె ఇప్పుడు కూడా తనతోనే ఉందని భావిస్తానని శశికళ అన్నారు. తనకే కాదని, తమిళనాడులోని ప్రతి ఇంట్లో జయలలిత గుర్తుకు రాని రోజు లేదని చెప్పారు. అందరూ ఆమెను తమ తల్లి లేదా సోదరిలా భావిస్తారని అన్నారు. ‘‘ఆమె ఇప్పటికీ మనందరితో ఉన్నారు. తమిళనాడు ప్రజలతో ఉన్నారు. అన్నాడీఎంకే కార్యకర్తలతో ఉన్నారు’’ అని వ్యాఖ్యానించారు.