లోక్‌సభ నుంచి మొయిత్రాను బహిష్కరించాలి: ఎథిక్స్‌ కమిటీ సిఫార్సు!

Cancel Mahua Moitra Lok Sabha membership, suggests Ethics Panel

న్యూఢిల్లీ: లోక్‌సభ నుంచి తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ సిఫారసు చేసింది. ఆమె చర్యలు అత్యంత అభ్యంతరకరం, అనైతికం, నేరపూరితం, హేయమైనవి, నేరపూరితమైనవని అని పేర్కొంటూ కఠిన చర్యలు తీసుకోవాలంటూ 500 పేజీలతో కూడి తుది నివేదికను రూపొందించింది. అయితే అది విడుదలకు ముందే మీడియాకు లీక్‌ అవడం గమనార్హం.

మొయిత్రా అనైతిక వ్యవహారంపై భారత ప్రభుత్వం న్యాయ, సంస్థాగత, కాలపరిమితితో కూడిన దర్యాప్తు చేపట్టాలని అందులో పేర్కొంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా డబ్బులు తీసుకున్నారన్న బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన ఆరోపణలపై 15 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఈ నెల 2న కమిటీ ముందు హాజరయ్యారు.

నగదు, బహుమతులకు బదులుగా పార్లమెంటులో ప్రశ్నలు అడగడానికి మహువా మోయిత్రా, వ్యాపారవేత్త దర్శన్ హిరానందాని మధ్య లంచం మార్పిడి జరిగిందని బీజేపీ ఎంపీ దూబే ఆరోపించిన విషయం తెలిసిందే. వారిద్దరి మధ్య జరిగిన లావాదేవీలకు సంబంధించి న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్ రాసిన లేఖను ఆయన ఉదహరించారు. అయితే వీటన్నింటినీ మహువా ఖండించారు. ఎంపీ నిషికాంత్ దూబే, జై అనంత్‌కు ఆమె ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించారు.