కేటీఆర్ ఫై వివేక్ వెంకటస్వామి ఆగ్రహం

టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ఫై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జీ. వివేక్ వెంకటస్వామి ఆగ్రహం వ్యక్తం చేసారు. మునుగోడు ఫలితాల అనంతరం మీడియా తో మాట్లాడిన కేటీఆర్..వివేక్ ఫై పలు కామెంట్స్ చేసారు. వివేక్‌ ఒక హవాలా ఆపరేటర్‌ మాదిరిగా అక్కడ రూ. 25కోట్లు, ఇక్కడ రూ.75 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. ఎవరికోసం ఇంత సొమ్ము ఇస్తున్నారు? అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను వివేక్ ఖండించారు.

కోకాపేటలో తమ కంపెనీ కోసం ల్యాండ్ కొనుగోలు చేస్తే .. హవాలా లావాదేవీలు జరిగాయాంటూ కేటీఆర్ తప్పుడు ప్రకటన చేశారంటూ మండిపడ్డారు. కంపెనీ కోసం తాము భూమి కొనడం తప్పా..? అని ప్రశ్నించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తాను డబ్బులు ఇచ్చానని కేటీఆర్ ఆరోపించడాన్ని తప్పుపట్టారు. జమునా హచరీస్ పైనా కేటీఆర్ లేనిపోని ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ నుంచి తనకు రెండున్నర కోట్లు వచ్చాయని కేటీఆర్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర పోలీసులతోనూ విచారణ చేయించుకోవచ్చని టీఆర్ఎస్ ప్రభుత్వానికి వివేక్ వెంకటస్వామి సవాల్ విసిరారు. ఫస్ర్టేషన్ లో కేటీఆర్ తమపై లేనిపోని ఆరోపణలు చేశారని మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిదే అని వివేక్ అన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల, పోలీసుల సహకారంతో టీఆర్ఎస్ గెలిచిందన్నారు. పోలింగ్ రోజు కూడా ఇతర నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మునుగోడులోనే తిష్టవేసి, విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బులు పంచిపెట్టారని ఆరోపించారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపును కేటీఆర్ గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రలోభాలతోనే ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచిందన్నారు.