మారువేషంలో ప్రజల మధ్యకు వెళ్లిన సిఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌

Manohar Lal Khattar..CM who traveled in disguise as a common man

చండీగఢ్: హర్యానా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఎలాంటి భద్రతా లేకుండా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్‌ ధరించి కాసేపు ప్రజల మధ్యలోనే తిరిగారు. హర్యానాలోని పంచకులలో సెక్టార్‌-5 లో ఉన్న ఓ గ్రౌండ్‌లో జరిగిన ఒక మేళాలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం ఒక సాధారణ వ్యక్తిలా కొద్దిసేపు ప్రజల మధ్యలో ఆ మేళా లో తిరిగారు. ఎవరూ గుర్తు పట్టకుండా ముఖానికి తువ్వాల చుట్టుకుని, క్యాప్‌ పెట్టుకుని ఆ ప్రాంతమంతా కలియతిరిగారు. ఆ సమయంలో సీఎం పక్కన ఎలాంటి భద్రతా లేదు. మేళాలో ఫుడ్‌స్టాల్‌ వద్ద తినుబండారాలను కొనుగోలు చేసి తిన్నారు. ఆ తర్వాత రద్దీగా ఉండే ఆ ప్రాంతం మొత్తం తిరిగి చూశారు. అక్కడ ఉన్న స్థానికులు ఆయన పక్కనే నిలబడి, అటూ ఇటూ తిరుగుతున్నా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌ను గుర్తుపట్టలేదు. అయితే, సీఎం ఎందుకు అలా మారువేషంలో జనం మధ్యలోకి వెళ్లారన్నది మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.