కాంగ్రెస్ యాడ్స్ ఫై బిఆర్ఎస్ ఆగ్రహం

ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఫై బిఆర్ఎస్ ఈసీ కి పిర్యాదు చేసింది. కాంగ్రెస్ రాజకీయ ప్రకటనలన్నింటినీ తక్షణమే ప్రసారం నిలిపివేయాలని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ శనివారం అన్ని మీడియా సంస్థలను ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రాజకీయ ప్రకటనలు ప్రసారం చేయడాన్ని గమనించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వికాస్ రాజ్ పేర్కొన్నారు. మీడియా సంస్థల ఎడిటర్లు, ఇన్‌పుట్ ఎడిటర్‌లందరికీ వికాస్ రాజ్ ఓ లేఖ రాశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రయోజనం కోసం స్టేట్ లెవల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలను సవరించి దుర్వినియోగం చేశారని లేఖలో తెలిపారు. మీడియా, టీవీ ప్రసారాల్లో రాజకీయ ప్రకటనల ప్రసారాలకు అనుమతి లేదన్నారు. రాజకీయ ప్రకటనలను ప్రసారం చేయడాన్ని తక్షణమే ఆపివేయమని లేఖలో కోరారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీఆర్ఎస్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ప్రజల్లో తమ ప్రకటనలకు వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్ భయపడిందన్నారు. పదేండ్ల వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన ప్రకటనలు ప్రగతిభవన్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ యాడ్స్ ఆపాలని ఎన్నికల సంఘంపై బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తెచ్చిందన్నారు. అన్ని రకాల నిబంధనలు పాటించినా కాంగ్రెస్ యాడ్స్ పై, బీఆర్ఎస్ ఒత్తిడితో ఈసీ నిబంధనలు విధించడం సరికాదన్నారు. ప్రకటనలు ఆపగలరేమో ప్రజాతీర్పును ఆపలేరని కాంగ్రెస్ తెలిపింది.