నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ

నెల్లూరులో నేటి నుంచి 5 రోజుల పాటు రొట్టెల పండుగ జరుగనుంది. స్వర్ణాల చెరువులో ఏటా నిర్వహించే రొట్టెల పండుగ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. 5 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి 12 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

పండుగలో భాగంగా నేడు సందన్ మాలి (సమాధుల శుభ్రం), రేపు గంధ మహోత్సవం, 31వ తేదీన రొట్టెల పండుగ, ఆగస్టు 1వ తేదీన తహలిల్ ఫాతేహా (గంధం పంపిణీ), 2వ తేదీన పండుగ ముగింపు ఉంటాయి. మొహరం పర్వదినాల్లో హిందూ, ముస్లింలు అని తేడా లేకుండా నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే పండుగనే రొట్టెల పండుగగా పిలుస్తారు.

ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. అయితే, ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం.. ఆ తర్వతే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెబుతుంటారు. 1930లో మొదలైన ఈ రొట్టెల పండుగ క్రమం తప్పకుండా ప్రతి ఏటా జరుగుతూ వస్తుంది.

కోరికలను కోరుకోవడం.. అవి నెరవేరితే.. మరుసటి ఏడాది రొట్టెలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.. ఇలాగే విద్యా రొట్టె, పెళ్లి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె.. ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేయడం భక్తుల నమ్మకంగా ఉంది.