వివేకా హత్య కేసు..నా స్టేట్మెంట్ ను సీబీఐ తప్పుగా రికార్డు చేసిందిః అజేయకల్లం

దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సీబీఐ వ్యవహరిస్తోందని విమర్శ

ajeya-kallam-comments-on-cbi-in-ys-viveka-murder-case-probe

అమరావతిః మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తాను ఇచ్చిన స్టేట్మెంట్ ను సీబీఐ మార్చేసిందని మాజీ ఐఏఎస్ అధికారి అజేయకల్లం సంచలన వ్యాఖ్యలు చేశారు. 2023 ఏప్రిల్ 29న తన వాంగ్మూలాన్ని సీబీఐ రికార్డు చేసిందని చెప్పారు. తాను చెప్పింది ఒకటైతే… ఛార్జ్ షీట్ లో సీబీఐ పేర్కొన్నది మరొకటని విమర్శించారు.

వివేకా హత్య రోజున ఏం జరిగిందో తన స్టేట్మెంట్ రికార్డు సమయంలో సీబీఐకి వివరించానని తెలిపారు. 2019 మార్చ్ 15 ఉదయం జగన్ నివాసంలో మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమయిందని… సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోర్ కొట్టారని అజేయకల్లం చెప్పారు. దీంతో ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్ కు ఏదో చెప్పారని తెలిపారు. ఆ తర్వాత జగన్ షాక్ కు గురైనట్టుగా లేచి, చిన్నాన్న చనిపోయారని చెప్పారని అన్నారు. ఇదే విషయాన్ని తాను సీబీఐకి చెప్పానని, ఇంతకు మించి మరేమీ చెప్పలేదని తెలిపారు.

జగన్ భార్య భారతి ప్రస్తావనను కానీ, ఇతర అంశాలను కానీ తాను సీబీఐ విచారణలో తీసుకురాలేదని ఆయన చెప్పారు. తాను చెప్పనివి సీబీఐ ఛార్జ్ షీట్ లో ఉన్నాయని, సీబీఐ అన్నీ అబద్ధాలనే పేర్కొందని అన్నారు. దర్యాప్తును తప్పుదోవ పట్టించేలా సీబీఐ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తన స్టేట్మెంట్ గా పేర్కొన్న అంశాలను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో అజేయకల్లం పిటిషన్ వేశారు.