త్వరలో హెచ్-1బీ వీసా మరో రౌండ్ లాటరీ

మార్చిలో తొలి రౌండ్ నిర్వహణ

United States to conduct second lottery round for H-1B applicants this year

న్యూయార్క్‌ః 2024 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా లబ్ధిదారుల ఎంపిక కోసం అమెరికా పౌరసత్వం, వలస సేవల శాఖ రెండోసారి లాటరీ నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం కోటా పూర్తయ్యేందుకు అదనపు లబ్ధిదారుల ఎంపిక కోసం లాటరీ నిర్వహించబోతున్నట్టు పేర్కొంది. గతంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలు చేసిన రిజిస్ట్రేషన్లతో ర్యాండమ్ పద్ధతిలో ఈ లాటరీ నిర్వహిస్తామని వెల్లడించింది.

హెచ్-1బీ వీసాల తొలి లాటరీ రౌండ్ మార్చిలో జరిగింది. అమెరికా ఏటా 65 వేల వీసాలను జారీ చేస్తుంటుంది. అమెరికా యూనివర్సిటీల్లో స్టెమ్ కోర్సులు చేసిన విదేశీయుల కోసం మరో 20 వేల హెచ్-1బీ వీసాలు అందుబాటులో ఉంటాయి. అమెరికా తాజా నిర్ణయంతో భారతీయ టెకీలకు లాభదాయకమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.