గ్యాస్‌ సమస్యకు బ్లాక్‌ సాల్ట్‌

Gas Problem

ఇళ్లలో రెగ్యులర్‌ సాల్ట్‌కి తోడు తినే సోడా ఉప్పును వంటల్లో వాడుతుంటారు. కొన్నిసార్లు నిమ్మ ఉప్పును కూడా వాడుతారు. ఈ బ్లాక్‌సాల్ట్‌ అనేది అందరూ వాడరు. ఎందుకంటే ఇది రెగ్యులర్‌ ఉప్పులా అని షాపుల్లోను దొరకదు. కాని దీనికి ఉన్న రుచి, వాసన, ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా.. పాపులారిటీ పెరుగుతోంది. చాలా మంది దీన్ని వాడేందుకు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఇందులో చాలా రకాలున్నాయి. వీటిలో హిమాలయన్‌ బ్లాక్‌ సాల్ట్‌ ఎక్కువగా వాడుకలో ఉంది. హిమాలయాల్లో ఉప్పు గనుల నుంచి ఈ సాల్ట్‌ను వెలికి తీస్తున్నారు. పూర్వం ఆయుర్వేద మందుల్లో దీన్ని వాడేవారు. ఇప్పుడు దీన్ని ఆయుర్వేదంతోపాటు ఇళ్లలో కూడా వాడుతున్నారు.

పేరుకి ఇది బ్లాక్‌ సాల్ట్‌ అయినా నల్లగా కాకుండా గులాబీ, గోధుమ రంగుల్లో ఉంటుంది. పూర్వం బ్లాక్‌ సాల్ట్‌లో మూలికలు, గింజలు, సుగంధ ద్రవ్యాల్ని కలిపి వేడి చేసేవారు. అది అత్యుత్తమమైనది. ఈ రోజుల్లో బ్లాక్‌ సాల్ట్‌ని కృత్రిమంగా కూడా తయారుచేస్తున్నారు. సోడియం క్లోరైడ్‌, సోడియం సల్ఫేట్‌, సోడియం బైసల్ఫేట్‌, ఫెర్రిక్‌ సల్ఫేట్‌ కలిపి ఈ మిశ్రమాన్ని చార్‌కోల్‌లో మిక్స్‌ చేసి వేడి చేస్తే బ్లాక్‌ సాల్ట్‌ తయారవుతుంది. మనం రెగ్యులర్‌గా వాడే సాల్ట్‌ బాగా ప్రాసెస్‌ చేసి, చాలా మినరల్స్‌ని తొలగించి ప్యాక్‌ చేస్తున్నారు. అందువల్ల అది అంతగా కలిసొచ్చేదేమీ ఉండట్లేదు. ఆయుర్వేద బ్లాక్‌ సాల్ట్‌ ప్యాకెట్‌ వినియోగించడం ఉత్తమం.

సాధారణ సాల్ట్‌ కంటే బ్లాక్‌ సాల్ట్‌ వాడటం మంచి అంటున్నారు డాక్టర్లు, ఆయుర్వేద నిపుణులు. ఎందుకంటే బ్లాక్‌ సాల్ట్‌లో తక్కువ సోడియం ఉంటుంది. హైబిపి ఉన్నవారికి బ్లాక్‌ సాల్ట్‌ మేలు చేస్తుంది. అయితే బ్లాక్‌ సాల్ట్‌ కొనేటప్పుడు అందులో సోడియం ఎంత ఉందో చూసుకోవాలి. కొన్ని రకాల బ్లాక్‌ సాల్ట్‌లలో సోడియం ఎక్కువగానే ఉంటుంది. కొన్ని టేబుల్‌ సాల్ట్‌లలో ప్రమాదకర పొటాషియం అయోడైట్‌, అల్యూమినియం సిలికేట్‌ వంటివి ఉంటాయి.

సంప్రదాయ బ్లాక్‌ సాల్ట్‌ ఎక్కువ ప్రాసెసింగ్‌ చెయ్యకుండా ఎక్కువ ఇతర పదార్థాలు కలపకుండా ఉంచుతారు. టేబుల్‌ సాల్ట్‌లో యాంటీ – కేకింగ్‌ ఏంజెట్స్‌ కలుపుతారు. బ్లాక్‌ సాల్ట్‌లో అవి ఉండవు. అయితే టేబుల్‌ సాల్ట్‌లో అయోడిన్‌ ఉంటుంది. ఇది శరీరంలో అయోడిన్‌ సరిపడా లేని వారికి మేలు చేస్తుంది. అదే సమయంలో హిమాలయా బ్లాక్‌ సాల్ట్‌లో ఎక్కువ ఖనిజాలుంటాయి. అవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
పొట్టలో గ్యాస్‌ సమస్యకు చెక్‌ పెడతాయి. చర్మం, జుట్టుకు మేలు చేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందువల్ల రెండు కూడా మంచివే. ఒక్కో రోజు ఒక్కోటి చొప్పున వాడినా రెండింటి ప్రయోజనాలు పొందవచ్చని సూచిస్తున్నారు. అయితే బ్లాక్‌ సాల్ట్‌ అనేది సింథటిక్‌ తరహా కాకుండా ఒరిజినల్‌గా ప్రకృతి నుంచి వచ్చేది వాడితే మేలు. మొత్తానికి ఉప్పు అనేది మనం ఎక్కువ వాడ కూడదు. రోజు ఒక వ్యక్తి 2300 మిల్లీ గ్రాములు మాత్రమే వాడాలి.

తాజా కెరీర్‌ సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/