టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బిజెపి కార్యకర్తలు నిరసన

లిక్కర్‌ స్కామ్‌లో ఆరోపణలు వచ్చిన కవితను ఎమ్మెల్సీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి కార్యకర్తలు కవిత ఇంటి వద్ద పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతూ.. కవిత ఇంటిని ముట్టడించేందుకు యత్నించారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని బిజెపి కార్యకర్తలను చెదరగొట్టారు. దీంతో పోలీసులకు , కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. కొంతమంది బిజెపి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోపక్క లిక్కర్‌ స్కామ్‌ కు తనకు ఎలాంటి సంబంధం లేదని కవిత క్లారిటీ ఇచ్చారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు.. దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్‌ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్‌ భయపడుతారేమో అని చూస్తున్నారని, ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కేసీఆర్‌ భయపడరన్నారు. ఏ విచారణ అయినా కేంద్రం చేసుకోవచ్చని చెప్పారు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు.

కేసీఆర్‌ కుమార్తెను కాబట్టే నా పైనా ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారని, మొక్కవోని దీక్షతో సీఎం కేసీఆర్‌ ఉద్యమాన్నినడిపించారన్నారు. మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులం అన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని తేల్చి చెప్పారు.