అతి త్వరలో మునుగోడు అభ్యర్థి ప్రకటన – రేవంత్

అతి త్వరలో మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సోమవారం సాయంత్రం ఢిల్లీ లోని సోనియా ఇంట్లో ప్రియాంక గాంధీ తో టికాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక ఫై చర్చించారు. సమావేశం అనంతరం రేవంత్ రెడ్డి మీడియా తో మాట్లాడారు.

మునుగోడు ఎన్నికలపై, పార్టీలో జరుగుతున్న అంతర్గత విభేదాలపై చర్చించామన్నారు. కాంగ్రెస్ లో అందరూ క్రమశిక్షణతో మెలగాలని అధిష్టానం సూచించిందని తెలిపారు. త్వరలోనే మునుగోడు ఉప ఎన్నికల అభ్యర్థిని ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామన్నారు. వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న పార్టీ పదవులపై ప్రియాంక గాంధీతో చర్చించామన్నారు.

ముఖ్యంగా మునుగోడు బై పోల్ పై ఫోకస్ పెట్టిన ప్రియాంక గాంధీ… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల గురించి రాష్ట్ర నేతలను అడిగి తెలుసుకున్నారు. మునుగోడులో నిర్వహించిన టీఆర్ఎస్, బీజేపీ సభల గురించి రాష్ట్ర నేతలు ప్రియాంక గాంధీకి వివరించారు. ఈ క్రమంలోనే టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జ్​ ​ మాణిక్కం ఠాగూర్ తమను పట్టించుకోవడం లేదని కొందరు సీనియర్లు ప్రియాంకకు కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్… అందుకు కావాల్సిన ప్రణాళిక రూపకల్పన గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర కాంగ్రెస్​ వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్‌‌ తో పాటు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధు యాష్కీ గౌడ్ , శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.