ఆ మూడు రాష్ట్రాలకు కొత్త ముఖాలను సీఎంలుగా నియమించాలని బిజెపి హై కమాండ్ చర్చ !

bjp-focus-on-cm-selection-in-chhattisgarh-rajasthan-and-madhya-pradesh

న్యూఢిల్లీః ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వేళ కొత్త ప్రభుత్వాల ఏర్పాటుపై గెలిచిన పార్టీలు దృష్టి పెట్టాయి. ఈ నేథ్యంలోనే బిజెపి తాను గెలిచిన మూడు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ లకు ముఖ్యమంత్రులను ఎంపిక చేసే పనిలో బిజీ అయింది. ఈ మూడు రాష్ట్రాలకు కొత్త ముఖాలను సీఎంలుగా నియమించాలని బిజెపి హై కమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ మూడు రాష్ట్రాలకు సీఎంలను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సీఎంలను ఎంపికపై చర్చించేందుకు మంగళవారం రోజున ప్రధాని మోడీ నివాసంలో నాలుగున్నర గంటల పాటు భేటీ జరిగింది.

ఈ భేటీకి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ బిజెపి ఇన్‌ఛార్జ్‌లతో అమిత్‌ షా, నడ్డా సమావేశమయ్యారు. కేంద్ర నాయకత్వం నియమించనున్న పరిశీలకులు ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలతో సమావేశమై సీఎంల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో త్వరలోనే ఈ రాష్ట్రాలకు సీఎం అభ్యర్థులను ప్రకటించనున్నారు.