సికింద్రాబాద్ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి

చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన పీఎం

pm-modi-condolences-to-secunderabad-fire-accident-death-families

న్యూఢిల్లీః సికింద్రాబాద్‌లోని రూబీ లాడ్జిలో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని వెల్లడించారు.

కాగా, రూబీ లాడ్జ్ సెల్లార్ లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. సెల్లార్ లోని ఎలెక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈ-బైకులు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. లాడ్జిలోని మొదటి, రెండో ఫ్లోర్లలో ఉన్న వారు ఊపిరి ఆడక చనిపోయినట్టు తెలుస్తోంది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పై నుంచి కిందకు దూకిన కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/