తెలంగాణలో 150 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందిః బండ్ల గణేశ్

ఢిల్లీలో కూడా జెండా ఎగురవేస్తామని ధీమా

bandla-ganesh-meet-clp-leader-bhatti-vikramarka-in-padayatra

హైదరాబాద్‌ః తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ పాల్గొన్నారు. ‘అన్నా వస్తున్నా’ అంటూ ట్వీట్ చేసిన బండ్ల గణేశ్.. ఈ మేరకు భట్టిని మర్యాదపూర్వకంగా కలిసి సంఘీభావం ప్రకటించారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుపాన్ వస్తోంది. ఇప్పటికే కర్ణాటక నుంచి స్టార్ అయింది. తర్వాత తెలంగాణను కొట్టుకుని, ఢిల్లీదాకా వెళ్లుంది. ఢిల్లీలో కూడా జెండా ఎగురవేస్తాం” అని చెప్పారు.

తెలంగాణలో 150 రోజుల్లో తమ ప్రభుత్వం వస్తుందని బండ్ల గణేశ్ అన్నారు. ‘‘గొప్పలు చెప్పుకోం.. డబ్బాలు కొట్టుకోం.. ప్రకటనలు ఇవ్వం.. సినిమాలు తియ్యం. ప్రజా సేవ చేస్తాం. తక్కువ మాట్లాడుతాం.. ఎక్కువ పని చేస్తాం.. ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసే వాళ్ల పరిపాలన ఇక్కడ చూస్తున్నారు” అని అన్నారు. భట్టి లాంటి నాయకుడికి మద్దతు తెలపడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. తామంతా కలిసి పోరాడతామనీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కప్పు కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు ప్రజలందరి సహకారాలు కావాలని అన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి నేతృత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్నారు.