టీఆర్‌ఎస్‌పై బీజేపీ చార్జిషీట్‌ దాఖలు – బండి సంజయ్

టిఆర్ఎస్ ఎమ్మెల్యే ల కొనుగోలు అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. బిజెపి నేతల తీరు ఫై టిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే..ఇదంతా కేసీఆర్ ఆడిన డ్రామా అంటున్నారు బిజెపి నేతలు. ఈ అంశం ఫై వరుస పెట్టి బిజెపి నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి తప్పు పడుతున్నారు. గురువారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మీడియా తో మాట్లాడుతూ..మునుగోడులో ఓడిపోతామన్న భయంతో టీఆర్ఎస్.. సీఎం కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీపై వస్తున్న ఆరోపణలపై టీఆర్‌ఎస్‌పై బీజేపీ చార్జిషీట్‌ దాఖలు చేస్తుందని పేర్కొన్నారు.

ఇదంతా ప్లాన్ ప్రకారం జరగిందని.. సీసీ టీవీ పుటేజీలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ ఎమ్మెల్యేలైతే ఉన్నారో.. వాళ్ల నెత్తిపై రూపాయి పెడితే అర్ధ రూపాయికి కూడా ఎవరూ కొనేందుకు సిద్ధంగా లేరంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. వాళ్లను కొనాల్సిన ఖర్మ కూడా బిజెపికి లేదు. భవిష్యత్తులో పార్టీలోని ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ ఈ స్కెచ్ వేశారని తెలిపారు.

మునుగోడు ఎన్నికల్లో ఏం చేస్తారో కేసీఆర్ చెప్పడం లేదని…. ఏం చేస్తామో తాము చెప్పామని అన్నారు. అభ్యర్థిని వెంటబెట్టుకుని తిరిగేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలే భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. కమెడియన్లకంటే దిగజారాడు సీఎం కేసీఆర్ అని అన్నారు. మీడియాకు ఇబ్బందులు జరిగితే మొదట స్పందించేది బీజేపీనే అని….వాస్తవ పరిస్థితులు చూపించాలని ఆయన సూచించారు. ప్రగతి భవన్ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని… అలాగే సీపీ, నలుగురు ఎమ్మెల్యేల కాల్ లిస్టు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కొత్త ఆడియోలు తయారు చేస్తున్నారు అవి ముఖ్యమంత్రి కి ఇంకా అందలేదట అంటూ ఎద్దేవా చేశారు.