టీఆర్ఎసోళ్లకు పదవులు బీజేపీ పెట్టిన భిక్ష : బండి సంజయ్

హైదరాబాద్ : టీఆర్ఎస్ పెట్టిన భిక్షవల్లే తనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి వచ్చిందంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 10వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ ఈరోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం అమరచింత మండలంలో పాదయాత్ర చేశారు. బండి సంజయ్ పాదయాత్ర క్రిష్ణంపల్లి చౌరస్తా వరకు చేరుకోగానే 100 కి.మీల నడక పూర్తయిన సందర్భంగా… అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు సంజయ్ పై పూలు చల్లి, కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సంరద్భంగా బండి ప్రసంగిచారు.

ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వమున్న పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. నరేంద్రమోడీ ఆధ్వర్యంలో నీతివంతమైన పాలనను బీజేపీ అందిస్తుందన్నారు. టీఆర్ఎస్ తోక పార్టీ అని, దొంగ దీక్షలు, దొంగ హామీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ అని విమర్శించారు. అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కేసీఆర్.. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే సహారా, ఈఎస్ఐ స్కాంలకు పాల్పడితే సీబీఐ విచారణ జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని అన్నారు. వందల మంది యువకులు చనిపోతుంటే… పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తెచ్చి రాష్ట్రం వచ్చేలా చేసిన వ్యక్తి సుష్మాస్వరాజ్ అని బండి సంజయ్ గుర్తు చేశారు. ఆనాడు సుష్మస్వరాజ్ ను తెలంగాణ ఆడ పడుచుగా పొగిడిన కేసీఆర్.. నేడు కనీసం ఆ ప్రస్తావన తీసుకురాకపోవడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. తెలంగాణ రావడం వల్లే కేసీఆర్ కు సీఎం, ఆ పార్టీ నేతలకు పదవులు వచ్చాయని చెప్పారు. టీఆర్ఎసోళ్లకు పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/