రేపు ఎంపీ, ఎమ్మెల్యేలతో సిఎం నితీశ్‌ కీలక సమావేశం

రేప‌టి భేటీ త‌ర్వాత నితీశ్ స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం

Bihar CM Nitish Kumar
Bihar CM Nitish Kumar

పాట్నాః బీహార్ సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), కేంద్ర ప్ర‌భుత్వంలోని బీజేపీ మధ్య కొన్నాళ్లుగా స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆదివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్ సిఎం దూరంగా ఉన్నారు. దాంతో, ఎన్డీఏ నుంచి జేడీయూ చీలిపోతుంద‌న్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావాలని నితీశ్ కుమార్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలిచినా ఆయన దూరంగా ఉన్నారు. నితీశ్ గైర్హాజరు వెనుక కారణాలపై అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదు.

ఇప్ప‌టికే బీహార్‌లో జేడీయూ-బీజేపీ పొత్తు తెగిపోతోందని ప్ర‌చారం న‌డుస్తోంది. చాలా మంది జేడీయూ ఎమ్మెల్యేలు మధ్యంతర ఎన్నికలకు విముఖత చూపుతున్నందున, రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడానికి ఆ పార్టీ.. ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తోందని రాజకీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

బీహార్‌లో ఇలాంటి రాజకీయ గందరగోళం మధ్య నితీశ్ కుమార్ మంగళవారం పాట్నాలో కీల‌క స‌మావేశం ఏర్పాటు చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ ఈ సమావేశానికి పిలిచినట్లు తెలుస్తోంది. ఈ భేటీ త‌ర్వాత ఎన్డీఏ నుంచి వైదొలిగే అంశంపై బీహార్ సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని అంతా ఆశిస్తున్నారు.

మ‌రోవైపు బీజేపీతో విభేదాల వార్త‌ల‌ను జేడీయూ జాతీయ అధ్య‌క్షుడు లాలన్ సింగ్ ఖండించారు. మిత్రపక్షమైన బీజేపీతో అంతా బాగానే ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మంగళవారం జరిగే కీలక సమావేశానికి ఆర్జేడీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాట్నాకు తరలిరావాలని కోరారు. కాగా, ఎన్డీయేకు మరో మిత్రపక్షమైన బీహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవామ్ మోర్చా కూడా మంగ‌ళ‌వారం తమ ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/