అందరినీ ప్రేమించాలి
అంతర్వాణి: బైబిల్ కథలు

‘ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకని యెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి (1 పేతురు 4:8)., ‘మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని యెరుగుదుము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచియున్నాడు.
తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు (1 యోహాను 3:14), ‘ప్రేమకలిగినవారై యొకనికొకడు దాసులైయుండుడి (గలతీ 5:13). ఇతరులను ప్రేమించాలనేది బైబిల్ వాక్యం ద్వారా దేవుడు మనకు బోధిస్తున్న ఆజ్ఞ. ‘నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించాలి అనేది దేవుడి రెండవ ఆజ్ఞ.
దేవుడి వాక్యం ఇంత స్పష్టంగా చెబుతుంటే మనమెందుకు ఇతరులను ప్రేమించేదానికంటే అధికంగా ద్వేషిస్తున్నాం. సంఘంలో ఇతరులను ప్రేమించి, ఆదరించేదానికంటే ఎక్కువగా ద్వేషిస్తున్నాం? ప్రభువు బల్లలో పాలుపొందుతూ తోటిసహోదరులను ప్రేమించలేకుండా ఉన్నాం. పలాన వారంటే నాకు పడదు, వారంటే నచ్చదు అంటూ ఇతరులను విమర్శించేదానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నామే తప్ప ఎదుటివారి గురించి మంచి చెప్పేందుకు ఇష్టపడడం లేదు. కానీ గంటలకొద్దీ ప్రార్థన మాత్రం చేస్తాం.
దేవుడి ఆజ్ఞల్ని పాటించకుండా ప్రభువు మందిరంలో చేరి, ఆయన శరీరంలో ఏవిధంగా భాగస్తులం కాగలం? ప్రతి మనిషిలోను బలహీనతలు ఉంటాయి. మంచి గుణాలు ఉన్నట్లుగానే బలహీనమైనవి ఉండొచ్చు. కొందరికి కోపం ఎక్కువ, ఇంకొందరికి ధనాపేక్ష, మరికొందరు స్వార్థంగా ఉంటారు. సత్యానికి బదులుగా అసత్యాలను పలుకుతారు. అయితే దేవ్ఞడి వాక్యం మనలో కార్యం చేసినప్పుడు, ఆయన వాక్యం మనల్ని గుచ్చబడినప్పుడు తప్పనిసరిగా మనల్ని మనం సరిచేసుకుంటాం. విధేయత, విశ్వాసం లేకుండా మనం దేవుడిని సేవించలేం. మన శత్రువు అపవాది తప్ప మనుషులు కాదు. మనుషులు మనల్ని ద్వేషించవచ్చు.
మనపై చెడుగా మాట్లాడుతూ వ్ఞండొచ్చు. మనకు హాని తలపెట్టవచ్చు. మనల్ని అణచివేసేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినంత మాత్రాన మనం ఏమాత్రం ప్రతిచర్యలకు పాల్పకుండా, ఎదుటివారికి మేలు చేయాలి. దేవుడి కృపనుబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. దీనత్వంతో ప్రభువును సేవించాలి. అప్పుడే మన ప్రార్థనలకు సమాధానం లభిస్తుంది. లేకపోతే మనం విశ్వాసులుగా చెప్పుకుంటున్నామే తప్ప దేవుడి పరిశుద్థాత్మ కార్యాలు మనలో ఏమాత్రం పనిచేయవు.. ప్రేమించడం అనేది కష్టమైన పని కాదు. ఇతరులను మనం ఎంతగా క్షమిస్తూ, ప్రేమిస్తూ ఉంటామో అంతగా దేవుడిని ఘనపరచగలం.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/