రేవంత్ రెడ్డికి అపాయింట్‌మెంట్ ఇవ్వని సీబీఐ, ఈడీ

cbi-ed-did-not-give-appointment-to-tpcc-chief-revanth-reddy

న్యూఢిల్లీ: టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కి సంబంధించి సీబీఐ , ఈడీ అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ రెండు సంస్థల నుంచి ఆయనకు అపాయింట్‌మెంట్‌ లభించలేదు. దీనిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రశ్నాప్రత్నం లీకేజీపై ప్రశ్నించినందుకు తమకు నోటీసులు ఇస్తున్నారని.. దోపిడీ దొంగతనం చేసిన కెటిఆర్‌ కు సమాచారం ఇస్తున్నారని మండిపడ్డారు. గత రెండు మూడు రోజులుగా సీబీఐ, ఈడి అపాయింట్‌మెంట్ల కోసం ప్రయత్నిస్తున్నానని.. కానీ రెండు సంస్థల డైరెక్టర్లు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదన్నారు. ఒక ఎంపీగా తాను అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు ఇవ్వాల్సిందే అని స్పష్టం చేశారు. ఇందులో కోట్ల రూపాయల కుంభకోణం, మనీలాండరింగ్ జరిగిందని తెలిపారు. హవాలాతో పాటు విదేశాల్లో లావాదేవీలు జరిగాయన్నారు. ఇందులో పాలకులు, ప్రభుత్వాధికారుల పాత్ర ఉందని ఆరోపించారు. అవినీతి నిరోధక చట్టం, మనీలాండరింగ్ చట్టాలు వర్తిస్తాయన్నారు. సిట్ అధికారి అవినీతి నిరోధక చట్టం కింద ఒక్క సెక్షన్ కూడా పెట్టలేదని… తద్వారా ముఖ్యమైన వ్యక్తులను కాపాడేందుకు సిట్ అధికారి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అందుకే సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలతో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాల్సిందే అని టీపీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీతో లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారని.. ఇందులో మంత్రి కెటిఆర్ పాత్ర ఉందని ఆరోపించారు. కెటిఆర్ తత్తర, తొందరపాటు చూస్తే జనానికి స్పష్టంగా అర్థమవుతుందన్నారు. లీకేజ్‌కి పాల్పడిన వ్యక్తుల మధ్య గొడవతో ఇది బయటపడిందని చెప్పారు. రాష్ట్రంలో సంచలన ఘటనలు జరిగినప్పుడు, అందులో ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడినప్పుడు, పక్కదారి పట్టించడం కోసం మాత్రమే సిట్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ, అమ్మకం కుంభకోణంలో కూడా అలాగే చేశారని చెప్పారు. ఐటీ శాఖ మంత్రికి సంబంధం ఏంటని కెటిఆర్ ప్రశ్నిస్తున్నారని… టీఎస్‌పీఎస్సీలో చైర్మన్ సహా అర్హత లేని ఏడుగురి నియామకంతోనే అవకతవకలకు పునాది వేశారని వ్యాఖ్యానించారు. కావలసిన వ్యక్తులను ప్రత్యేకంగా కూర్చోబెట్టి పరీక్షలు రాయించారన్నారు. వీటన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కప్పిపుచ్చిందని మండిపడ్డారు. ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడ్డ తర్వాత ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది అంటూ కెటిఆర్ చెప్పారని… అప్పటికి నిందితులను కస్టడీలోకి కూడా తీసుకోలేదు. విచారణ జరగలేదన్నారు. విచారణ జరగకముందే కెటిఆర్‌కు ఈ విషయం ఎలా తెలిసిందని ప్రశ్నించారు.