నగరంలో 40 డిగ్రీలకు చేరుకోనున్న ఉష్ణోగ్రతలు..అలెర్ట్ జారీ

ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక

temperature

హైదరాబాద్‌ః ఇటీవల కురిసిన వడగండ్ల వానను హైదరాబాద్ వాసులు ఫుల్ ఎంజాయ్ చేశారు. తాజాగా ఎండాకాలం ప్రతాపం చూపుతోంది. చల్లటి వాతావరణం కాస్తా మండుటెండగా మారుతోంది. రాబోయే రోజుల్లో ఎండ దంచి కొడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వారంలోనే హైదరాబాద్ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపింది.

ఈ క్రమంలో ఒకటి, రెండు రోజుల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను తాకే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరం భీమ్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎండలు జనాలకు ముచ్చెమటలు పట్టిస్తాయని పేర్కొంది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలను పాటించాలని సూచించింది.