పీవీకి భారత రత్న ఇవ్వాలి – తలసాని

మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. పీవీ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని మాట్లాడుతూ.. మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ పీవీని కేంద్రం విస్మరించడం బాధాకరం అన్నారు. క్లిష్ట పరిస్థితులలో ఉన్న దేశాన్ని ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన పీవీకి భారత రత్న ఇవ్వాలని కోరారు.

ప్రపంచ దేశాలకు భారత ఖ్యాతిని చాటి చెప్పిన పీవీని గౌరవించకపోవడం విచారకరం అని, పీవీ శతజయంతి సందర్భంగా ఏడాది పొడవునా వేడుకలు నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం గౌరవించింద‌ని గుర్తు చేశారు. మన మధ్య భౌతికంగా ఆయ‌న లేకపోయిన.. ప్ర‌జ‌ల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే గొప్ప వ్యక్తి పీవీ నర్సింహా రావు అని కొనియాడారు.

అలాగే పీవీ గొప్పతనం భావి తరాలకు తెలిసేలా ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నట్లు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ వద్ద కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘తెలుగు వారు గర్వపడే వ్యక్తి పీవీ. ఆయనకు భారత ప్రభుత్వం, ప్రధాని తరఫున నివాళులు. ఢిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తున్నాం. ఢిల్లీలో పీఎం మ్యూజియంలో పీవీ గుర్తుగా పలు జ్ఞాపకాలను ఏర్పాటు చేశాం. పీవీ నరసింహా రావు చరిత్ర అందరికీ తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నాం. ఆయన గొప్పదనం అందరికీ తెలిసేలా తపాలా బిళ్ల విడుదలకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.