తెలంగాణ లో కాసాని జ్ఞానేశ్వర్‌కు టీడీపీ పగ్గాలు

తెలంగాణ లో టీడీపీ అనేది పూర్తిగా కనుమరుగైపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం తీసుకరావాలని పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. ఎలాగైనా నాటి వైభవాన్ని తేవాలన్న పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా కాసాని జ్ఞానేశ్వర్‌ ను నియమించారు. ఈ మేరకు చంద్రబాబు శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం టీ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న బక్కని నర్సింహులును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించిన చంద్రబాబు…ఆయనకు పార్టీ అత్యున్నత నిర్ణాయక విభాగం పొలిట్ బ్యూరోలో స్థానం కల్పించారు.

తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో టీడీపీలోనే కొనసాగిన కాసాని… రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన కాసానికి ఆ వర్గంతో పాటు తెలంగాణలో మంచి పట్టు ఉంది. చాలా కాలం పాటు పార్టీకి దూరంగా ఉన్న కాసాని ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ గూటికి చేరిన వెంటనే ఆయనకు పార్టీ రాష్ట్ర పగ్గాలు దక్కడం గమనార్హం. ఈ నెల 10న కాసాని టీ టీడీపీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 32 లక్షల సభ్యత్వం ఉంది. ఈ సభ్యత్వాన్ని 40 లక్షలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని తెలిపారు. ప్రతి గ్రామంలో తెలుగుదేశం జెండాను ఎగరవేస్తామని చెప్పారు. నాయకులు, కార్యకర్తలను ఒకతాటిపై తీసుకొచ్చి పార్టీకి పూర్వవైభం తీసుకోస్తామని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల పార్టీ అయిన తెలుగుదేశంతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తమ పార్టీ బలపడుతోందని ఆయన చెప్పారు.