పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ల‌తో 26న సోనియా భేటీ

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓట‌మితో పాటు తాజా రాజ‌కీయ ప‌రిస్ధితుల‌పై చ‌ర్చించేందుకు ఈనెల 26న పార్టీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌ల‌తో కాంగ్రెస్ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ స‌మావేశం కానున్నారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగే ఈ కీల‌క భేటీకి పార్టీ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి (సంస్ధాగ‌త‌) కేసీ వేణుగోపాల్ అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. ఈ స‌మావేశానికి సోనియా గాంధీ హాజ‌రై పార్టీ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం పురోగ‌తిని స‌మీక్షించ‌డంతో పాటు దేశ‌వ్యాప్తంగా మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా చేప‌ట్టాల్సిన ఆందోళన కార్య‌క్ర‌మాల గురించి పార్టీ నేత‌ల‌తో చ‌ర్చిస్తారు.

మ‌రోవైపు అస‌మ్మ‌తి నేత‌ల‌తో కూడిన జీ-23 ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన సోనియా పార్టీ ప్ర‌క్షాళ‌న గురించి సంప్ర‌దింపులు జ‌రిపారు. జీ-23 నేత‌ల సూచ‌న‌లు ఆహ్వానించ‌ద‌గిన‌వ‌ని వారు కోరిన రీతిలో పార్టీ నిర్మాణంలో మార్పులు చేప‌ట్టేందుకు సంస్ధాగ‌త ఎన్నిక‌ల వ‌ర‌కూ వేచిచూడాల‌ని స్ప‌ష్టం చేశారు. ఇక వ‌చ్చే ఏడాది హిమాచల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌గా ఆ రాష్ట్ర సీనియ‌ర్ నేత‌ల‌తో సోనియా గాంధీ స‌మావేశ‌మ‌య్యారు. పంజాబ్ త‌ర‌హా అంత‌ర్గ‌త పోరుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా స‌మిష్టిగా నేత‌లు పార్టీ విజ‌యం కోసం ప‌నిచేయాల‌ని సూచించారు. ప్ర‌త్య‌ర్ధుల‌కు దీటైన పోటీ ఇచ్చేలా ఎన్నిక‌ల వ్యూహాన్ని సిద్ధం చేయాల‌ని, రోడ్‌మ్యాప్‌పై క‌స‌ర‌త్తు సాగించాల‌ని ఆమె హిమాచ‌ల్‌ నేత‌ల‌ను కోరారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/