రాహుల్ భారత్​ జోడో యాత్రలో జేబు దొంగలు హల్చల్

రాహుల్ చేపట్టిన భారత్​ జోడో యాత్రలో జేబు దొంగలు రెచ్చిపోతున్నారు. పాదయాత్రలో పాల్గొంటూ నేతల జేబులు కట్ చేస్తూ అందిన దగ్గరికి దోచుకుంటున్నారు. ఆరు రోజుల క్రితం తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ యాత్ర మొదలైంది. జమ్మూకాశ్మీర్ వరకు సాగుతుంది. మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలల్లో 148 రోజుల పాటు సాగుతుంది. సుమారు 3,570 కి.మీ. మేర రాహుల్ గాంధీ పాదయాత్ర చేయనున్నారు.

దేశంలో మతోన్మాదం, విభజన రాజకీయాలు, ద్రోవ్యోల్పణ, నిరుద్యోగ సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేయాలన్న లక్ష్యంతోనే భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. ప్రస్తుతం 6 వ రోజుకు చేరుకుంది. అంతబాగానే ఉంది కానీ యాత్రలో జేబు దొంగలు చేతివాటం చూపించడం నేతలకు తలనొప్పిగా మారింది. కేరళలోని కరమన పోలీస్ స్టేషన్​ పరిధిలో యాత్ర జరుగుతుండగా జేబు దొంగతనాలు జరిగాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నలగురు దొంగలను గుర్తించామని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున జనం గుమికూడినప్పుడు దొంగలు వస్తారని.. అందువల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇదిలా ఉంటె యాత్రలో సరికొత్త వివాదం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్‌పై తాజాగా రగడ మొదలైంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిక్కరును తగులబెడుతున్న ఫొటోపై మరో 145 రోజులు మాత్రమే భారత్ జోడో యాత్ర ఉందనే క్యాప్షన్ రాసి ఉంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేసిన విద్వేషం నుంచి దేశాన్ని కాపాడతామని, ఒక్కొక్క అడుగు వేస్తూ లక్ష్యాన్ని చేరుకుంటామని ట్విట్‌కు మ్యాటర్ జత చేశారు.