మేడిపల్లిలో బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రారంభం

పార్లమెంట్​ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్​ మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్​ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ప్రజాహిత యాత్ర ను శనివారం ప్రారభించారు. ఇందులో భాగంగా మొదటిగా కరీంనగర్​లోని మహాలక్ష్మి ఆలయంలో బండి సంజయ్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్​పై స్పందించారు.

బడ్జెట్​ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు అమలు కావాలంటే రూ.5 లక్షల కోట్లకు పైగా అవసరమవుతుందని అన్నారు. కాని కేవలం రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు, బడ్జెట్ కేటాయింపులకు పొంతనేలేదని తెలిపారు. విద్యకు 16 శాతం నిధులు కేటాయిస్తామన్న హమీని పూర్తిగా విస్మరించారని విమర్శించారు.

పేదల కోసం యుద్దం చేస్తున్న తనను గెలిపించాలని కోరారు. మోడీని మళ్లీ మూడోసారి గెలిపించేందుకే ప్రజాహిత పాదయాత్ర ప్రారంభిస్తున్నానని తెలిపారు. ఈ యాత్రను ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఇచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ మోడీ కులంపై ప్రశ్నించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో బాబ్రీమసీదు కడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.