కొనసాగుతున్న భారత్ బంద్

కేంద్రం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ ఈరోజు దేశంలో గ్రామీణ భారత్ బంద్ కు సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఉ.6 నుంచి సా.4 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుంది. మ. 12 గంటల నుంచి సా.4 గంటల వరకు దేశంలోని ప్రధాన రోడ్లపై రైతులు చక్కా జామ్ చేపడతారు. అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. గ్రామాల్లో కూరగాయల అమ్మకాలు బంద్ అవుతాయని రైతు నేత రాకేశ్ టికాయత్ తెలిపారు.

కేంద్రంపై నిరసనలు చేపట్టేందుకు అనేక రైతు సంఘాలు.. కొన్ని రోజుల క్రితం పంజాబ్​, హరియాణా నుంచి దిల్లీవైపు కదిలాయి. కానీ.. వారందరిని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. బ్యారికేడ్లు వేసి, భారీగా భద్రతా ఏర్పాట్లు చేసి.. వారిని దిల్లీలోకి రానివ్వకుండా చేశారు. అంతేకాకుండా.. హరియాణాలో.. రైతులపై టియర్​ గ్యాస్​ని సైతం ప్రయోగించారు.

గ్రామీణ భారత్​ బంద్​ కారణంగా.. రవాణా వ్యవస్థ, వ్యవసాయ కార్యకలాపాలు, ఎంఎన్​ఆర్​ఈజీఏ (మహాత్మా గాంధీ నేషనల్​ రూరల్​ ఎంప్లాయిమెంట్​ గ్యారంటీ యాక్ట్​) పనులు, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామీణ దుకాణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్​, సర్వీస్​ సేక్టార్​లపై ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే.. భారత్​ బంద్​లో అంబులెన్స్​ సర్వీసులు, న్యూస్​ పేపర్​ పంపిణీ, పెళ్లిల్లు, మెడికల్​ షాప్​లు, విద్యార్థుల పరీక్షలు వంటి ఎమర్జెన్సీ సేవలపై ఎలాంటి ప్రభావం ఉండదని పలు నివేదికలు సూచిస్తున్నాయి.