మునుగోడు లో యూత్ సంఘాలకు టిఆర్ఎస్ పార్టీ భారీగా గణేష్ చందాలు..

మునుగోడు లో ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు టిఆర్ఎస్ పార్టీ. ఎలాగైనా మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచి బిజెపి కి బుద్ది చెప్పాలని గట్టి ప్రణాళికలే చేస్తుంది. ఇక ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానప్పటికీ..ఇప్పటి నుండి నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ ప్రజలను ఆకట్టుకునే పనిలో ఉంది. ఇప్పటికే గోడ గడియారాలు , గొడుగులు పంచిన పార్టీ నేతలు..ఇప్పుడు గణేష్ ఉత్సవాలను క్యాష్ చేసుకుంటున్నారు. చౌటుప్పల్ మండల కేంద్రంలోని అన్ని యూత్ సంఘాలకు రూ. 10 వేల నుండి 20 వేల వరకు చందాలు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పార్టీని, పార్టీ గుర్తును విస్తృతంగా ఓటర్లకు చేర్చాలని టీఆర్‌ఎస్‌ లీడర్లు ప్రయాత్నాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటె మరోపక్క బిజెపి నుండి బరిలోకి దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ ..టిఆర్ఎస్ పార్టీ ఫై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే మునుగోడులో పోటీ చేయాలనీ సవాల్ చేసారు. అంతే కాదు మునుగోడు ఉప ఎన్నికల తర్వాత నెల రోజుల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో నిర్వహించిన పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశంలో రాజగోపాల్ పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ రాజకీయాలను మారుస్తుందని అన్నారు. టిఆర్ఎస్ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని..ఎన్ని కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలిచేది లేదని స్పష్టం చేశారు.

మునుగోడు ఉపఎన్నిక తెలంగాణ ప్రజలు, కేసీఆర్ కుటుంబానికి మధ్య జరుగుతున్న యుద్ధమని పేర్కొన్నారు. మునుగోడులో కేసీఆర్ పోటీ చేసినా టీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజలకు ఆత్మగౌరవం ఎక్కువని.. ఆకలినైనా తట్టుకుంటారు గానీ.. ఓట్లు అమ్ముకోరని స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ప్రజలు ఇచ్చే తీర్పు చారిత్రాత్మకం కానుందని అన్నారు.