కేసీఆర్ వారసుడు హరీశ్ రావే: రాజగోపాల్ రెడ్డి

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెండు రోజులుగా వార్తల్లో హైలైట్ అవుతున్నారు. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వారసుడు హరీశ్ రావేనని పేర్కొన్నారు. ‘బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకుంటే మంచిది. ఆ పార్టీ బతకాలంటే హరీశ్ అధ్యక్షుడు కావాలి. కేటీఆర్ అధ్యక్షుడైతే ఒక్కరు కూడా అందులో మిగలరు. భవిష్యత్తులో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. బీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదు. ఎంఐఎం మాతోనే ఉంది’ అని చెప్పుకొచ్చారు.

బీఆర్ఎస్‌​లో చాలా మంది నేతలు అవమానానికి గురై ఉన్నారని , డబ్బు ఉన్న నేతలు పార్టీలోకి వస్తే ఎలా వాడుకోవాలో తమకు బాగా తెలుసన్నారు. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. ప్రభుత్వం పడిపోవడానికి ఒక్క ఉదంతం చాలన్న రాజగోపాల్ రెడ్డి.. ఎన్నిసార్లు అధికారంలో ఉంటామనేది ఎవ్వరు చెప్పలేమన్నారు. ఐదేఏళ్లు తమ ప్రభుత్వానికి ఏమి ఢోకా లేదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్‌ను ఓడించేందుకు దళితబంధు తెచ్చారని.. దళితులపై ప్రేమతో కాదని కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. భువనగిరి నుంచి బీసీకి ఎంపీ టికెట్ ఇస్తే గెలిపించే బాధ్యత తనదేనని రాజగోపాల్ పేర్కొన్నారు.