పార్టీ లో చేరిందో లేదో.. జే శాంత కు కీలక పదవి అప్పగించిన జగన్

కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి…అని అప్పుడు చిరంజీవి ఠాగూర్ సినిమాలో పాడితే..ఇదే పాటను చాలామంది రాజకీయ నాయకులు తమ పదవుల విషయంలో పాడుకుంటున్నారు. కొడితే గట్టి పదవే కొట్టాలి కానీ చిన్న చితక పదవులు కొట్టొద్దని సమీప వ్యక్తుల వద్ద చెపుతుంటారు. తాజాగా వైసీపీ లో చేరిన జే శాంత..సాయంత్రంకల్లా గట్టి పదవే కొట్టి అబ్బా అనిపించింది.

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉత్కంఠ రేపుతున్నారు. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేది లేదని ముందు నుండి చెపుతూ వస్తున్నా జగన్..చెప్పినట్లే ఈసారి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేల కు టికెట్ ఇవ్వకుండా పార్టీ కోసం పనిచేస్తూ..ప్రజల మధ్య ఉంటున్న వారికీ టికెట్ ఖరారు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత శ్రీరాములు సోదరి, బళ్లారి మాజీ ఎంపీ జే శాంత వైఎస్సార్‌సీపీలో చేరారు. మంగళవారం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్‌ పార్టీ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన మాజీ ఎంపీ జే శాంత వాల్మీకి సామాజికి వర్గానికి చెందినవారు. 2009లో బీజేపీ తరపున కర్ణాటకలోని బళ్లారి నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

శాంత ఉదయం పార్టీలో చేరితే.. సాయంత్రానికి ఆమెకు ఎంపీ సీటును ప్రకటించారు. హిందూపురం లోక్‌సభ నియోజకవర్గం సమన్వయకర్తగా ప్రకటించారు. శాంత గాలి జనార్దన రెడ్డికి అత్యంత సన్నిహితుడైన శ్రీరాములుకు శాంత సొంత సోదరి. గాలి జనార్దన రెడ్డి ప్రోద్బలంతోనే రాజకీయాల్లో అడుగుపెట్టారు. గతంలో బళ్లారి ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆమె కర్ణాటక నుంచి వచ్చి హిందూపురంలో పోటీకి సిద్ధమయ్యారు. అయితే శాంత సొంత ఊరు గుంతకల్లు అని చెబుతున్నారు. ఆసక్తికరంగా ఉదయం పార్టీలో చేరగా.. సాయంత్రానికి సీటు ఇచ్చేయడం ఆసక్తికరంగా మారింది.