తగ్గేదేలే అంటున్న బర్రెలక్క ..ఎంపీగా పోటీకి సిద్ధం

కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నామినేషన్ వేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన బర్రెలక్క లోక్ సభ ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతుంది. తాను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. నాగర్ కర్నూలు నుంచి ఎంపీతో పాటు ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతానని .. గెలిచే వరకు పోటీ చేస్తూనే ఉంటానని .. నిరుద్యోగుల కోసం గళం ఎత్తుతానని చెప్పుకొచ్చింది. ఒక నిరుద్యోగి తలుచుకుంటే ఏదైనా చేయగలరని ప్రపంచానికి చాటి చెబుతానన్నారు.

బర్రెలక్క అసలు పేరు కర్నె శిరీష. డిగ్రీ చదువుకున్నా బర్రెలు కాసుకుంటున్నా అంటూ ఆమె చేసిన వీడియో అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఆ తరవాత ఆమె పేరు కాస్త బర్రెలక్కగా మారిపోయింది. పోటీ పరీక్షలు రాసి విసిగిపోయిన బర్రెలక్క ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి నిరుద్యోగులకు న్యాయం చేయాలని భావించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి జూపల్లి కృష్ణారావు అక్కడ విజయం సాధించారు. అయితే బర్రెలక్కకు 6000 ఓట్లు దక్కాయి. ఓటమి విషయంలో కాస్త నిరాశపాలైనా తన పట్టుదల మాత్రం వీడలేదు బర్రెలక్క. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.