ఏపీలో నేటి నుంచి వాలంటీర్ల నిరసన

వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణను డిమాండ్ చేస్తూ సమ్మెకు నిర్ణయం

Volunteers protest in AP from today

అమరావతిః ఏపీలో గ్రామ వాలంటీర్లు నేటి నుంచి సమ్మె చేయనున్నారు. గౌరవ వేతనం పెంపు, సర్వీసుల క్రమబద్ధీకరణ లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న గ్రామ వాలంటీర్లు సమ్మె చేసేందుకు రెడీ అయ్యారు. అంతేకాకుండా, ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమానికి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. వాలంటీర్లతో సమ్మె ఆలోచన విరమింపజేసేందుకు అధికారులు సోమవారం సాయంత్రం వరకూ తీవ్రంగా ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. మంగళవారం సమ్మె సైరన్ మోగించేందుకు వాలంటీర్లు డిసైడయ్యారు.

2019 అక్టోబర్‌లో జగన్ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఒక్కో వాలంటీరుకు రూ.5 వేలు గౌరవవేతనంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వ పథకాల అమలులో క్రియాశీలకంగా ఉంది. అయితే, గౌరవ వేతనానికి సంబంధించి కొంత కాలంగా వాలంటీర్లలో అసంతృప్తి గూడు కట్టుకుంది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్ట్ కార్మికుల జీతాలంత కూడా తమకు రావట్లేదని వాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాగా, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఇటీవల రాష్ట్రంలోని గ్రామ, వార్డ్ వాలంటీర్లకు రూ. 750 జీతం పెంపు ప్రకటించిన సంగతి తెలిసిందే.