పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతీ ఆత్మహత్య ..

ఇటీవల చాలామంది యువతీ , యువకులు చిన్న చిన్న వాటికే కోపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తల్లిదండ్రులు మందలించారని లేదా అడిగినంత డబ్బులు, కోరిన కోర్కెలు తీర్చలేదని, మార్కులు సరిగా రాలేదని, స్నేహితుడు తిట్టాడని ఇలా చిన్న చిన్న వాటికీ మనస్థాపానికి గురై బలవనర్మణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో అదే జరిగింది. ఇంట్లో చిన్న గొడవకు పది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతీ ఆత్మహత్య చేసుకొని ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

వివరాల్లోకి వెళ్తే..

ఖమ్మం జిల్లా కరకగూడెం మండలంలోని రేగుళ్ల గ్రామానికి చెందిన జనగం మానస (20)కు అదే గ్రామానికి చెందిన చప్పిడి ప్రశాంత్ అనే యువకుడితో పెళ్లి కుదిరింది. ఈనెల 22న ముహర్తం ఖరారు చేశారు. పెళ్లి పత్రికలు పంపకాలు, బంధువుల హడావుడి నెలకొన్నసమయంలో ఇంట్లో తగాదాలు మొదలయ్యాయి. మానస తండ్రి పుల్లయ్య, అన్నయ్య చందు మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలోనే పెళ్లి పత్రికలను అన్నయ్య తగులబెట్టాడు. ఈ విషయంపై బుధవారం తండ్రి పుల్లయ్య కరకగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.

ఇంట్లో గొడవలు కారణంగా మనస్థాపానికి గురైన మానస పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మణుగూరు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మానస తుది శ్వాస విడిచింది. ఈ ఘటన తో ఆ కుటుంబంలో విషాదం అల్లుకుంది.