తెలంగాణ కు 12 మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం పట్ల కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన బండి సంజయ్

bandi-sanjay

తెలంగాణ కు 12 మెడికల్ కాలేజీలు మంజూరు చేయడం పట్ల కేంద్రానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు. మెడికల్ విద్యార్థులకు కేంద్రం తీపి కబురు తెలిపిన సంగతి తెలిసిందే. దేశంలో కొత్తగా మరో 50 వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిలో తెలంగాణకు 12, ఆంధ్రప్రదేశ్‌కు 5 కొత్త కాలేజీలకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. తెలంగాణలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలల్లో 9 ప్రభుత్వ వైద్య కళాశాలలు కాగా 3 ప్రైవేటువి. తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి ఆసిఫాబాద్‌, వికారాబాద్‌, భూపాలపల్లి, జనగామ, సిరిసిల్ల, నిర్మల్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభం కానున్నాయి.

రాష్ట్రానికి కొత్తగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇవ్వడం హర్షణీయం అని బండి సంజయ్‌ అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ప్రధాని మోడీ గారికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ ఎల్.మాండవీయ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తెలంగాణ అభివ్రుద్ధి పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శం అని ప్రకటించారు. తెలంగాణ అభివ్రుద్ధి, సంక్షేమం విషయంలో కేంద్రం ప్రత్యేక నిధులిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోయినా తెలంగాణ ప్రజలపట్ల మోదీగారికి ఉన్న అభిమానంతో తెలంగాణ అభివ్రుద్దిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారన్నారు.

మెడికల్ కాలేజీల ఏర్పాటు విషయంలో కేంద్రం సహకరించలేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం పచ్చి అబద్దం. కేంద్ర నిధులతో తెలంగాణలో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామని, ఈ మేరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ నాటి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హర్షవర్దన్ స్వయంగా లేఖ రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. ఈ విషయంలో సైంధవుడులా అడ్డుకున్న కేసీఆర్ తిరిగి కేంద్రం సహకరించలేదనడం సిగ్గు చేటు అంటూ బండి సంజయ్ ట్విట్టర్ లో పోస్ట్‌ పెట్టారు.