జగన్‌ బస్సు యాత్రకు విరామం

Interruption of Jagan bus yatra

అమరావతిః ఏపిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు సీఎం జగన్ ఈరోజు బ్రేక్ ఇచ్చారు. ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నికల వ్యూహంపై ఈరోజు జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీనియర్ నేతలు పాల్గొంటారు. ఈ భేటీలో ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకర్షించడం తదితర అంశాలపై వ్యూహరచన చేయనున్నారు.

మరోవైపు ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పనపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు సమాచారం. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిని మేనిఫెస్టోలో పొందు పరుస్తున్నారని తెలుస్తోంది. మేనిఫెస్టోను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి ధీటుగా వైసీపీ మేనిఫెస్టోను రూపొందిస్తున్నారు.

రేపు వైసీపీ సోషల్ మీడియా వింగ్ తో జగన్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. సోషల్ మీడియా వింగ్ తో సమావేశం తర్వాత జగన్ బస్సు యాత్ర మళ్లీ ప్రారంభమవుతుంది. రేపు విజయనగరం జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. రోడ్ షో, బహిరంగసభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.