కెటిఆర్, రాహుల్ వ్యాఖ్యలు చూస్తుంటే బీసీ సీఎం కాకుండా కుట్రలు చేస్తున్నారుః బండి సంజయ్

బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండ్

bandi-sanjay-comments-on-rahul-gandhi-and-ktr-over-obc-comments

హైదరాబాద్‌ః దేశాన్ని యాభై ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఏనాడూ ఓబీసీ కులగణన చేయాలనే ఆలోచన చేయలేదని, అధికారం కోల్పోయి పార్టీ మనుగడ ప్రమాదంలో పడటంతో ఇప్పుడు ఓబీసీల జపం చేస్తోందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ… అధికారంలోకి వస్తే ఓబీసీ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ఆ ఆలోచన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ స్వార్థ రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనమన్నారు.

తెలంగాణలో బిజెపికి రెండు శాతం ఓట్లు కూడా రావని, అలాంటి పార్టీ బీసీ ముఖ్యమంత్రిని ఎలా చేస్తుంది? అని అడుగుతూ, రాహుల్ గాంధీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మొన్న మంత్రి కెటిఆర్, నిన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి కాకుండా చేసే కుట్రలు సాగుతున్నట్లుగా తెలుస్తోందన్నారు. బీసీలకు రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాతే ఓబీసీల ఓట్లు అడగాలన్నారు.