బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బెయిల్ రద్దు పిటిషన్ ను హన్మకొండ కోర్టు గురువారం కొట్టి వేసింది. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో అరెస్ట్ అయిన బండి సంజయ్ ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బండి సంజయ్ విచారణకు సహకరించడం లేదని.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు హన్మకొండ కోర్టును ఆశ్రయించారు.

బండి సంజయ్ బయట ఉండటం వల్ల విచారణ ఆలస్యమవుతుందని పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు. అయితే బీజేపీ లీగల్ సెల్ ఈ వాదనలను తిప్పికొట్టింది. బండి సంజయ్ కి ఇచ్చిన స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తున్నారని, రాజకీయ కుట్రలో భాగంగానే ఆయన బెయిల్ ను రద్దు చేయాలని పోలీసులు కోరుతున్నారని న్యాయస్థానానికి తెలిపింది. ఇరువైపుల వాదనల అనంతరం ప్రాసిక్యూషన్ వాదనలతో మెజిస్ట్రేట్ విభేదించి, బెయిల్ రద్దు పిటిషన్ ను కొట్టివేశారు.

బండి బెయిల్ రద్దు పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసిందని సంజయ్ తరఫు న్యాయవాదులు తెలిపారు.