‘‘అన్నయ్యా..” అంటూ పవన్ ఫై తన అభిమానాన్ని చాటుకున్న సముద్రఖని

విలక్షణ నటుడు, డైరెక్టర్ సముద్రఖని ఏప్రిల్ 26 న పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ తరుణంలో ఆయన కు పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు , అభిమానులు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే విషెష్ అందజేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ సైతం సోషల్ మీడియా లో ఓ లేఖ విడుదల చేసారు.

‘‘ప్రతిభావంతుడైన దర్శకుడు, రచయిత, నటుడు, మా బంగారు గని సముద్రఖనికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహశీలి అయిన సముద్రఖని మానవ సంబంధాలపై విశ్వాసం ఉన్నవారు. అందుకే ఆయన చిత్రకథల్లో ఆ భావనలు కనిపిస్తాయి. నేను నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రంలో ఒక ముఖ్య భూమిక పోషించారు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను’’ అని తెలిపారు.

దీనికి సముద్రఖని బదులిచ్చారు. ‘‘అన్నయ్యా.. నా పట్ల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా, దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలను నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని, చైతన్యాన్ని నాలో నింపింది’’ అని పేర్కొన్నారు.

‘‘సమాజం పట్ల మీకున్న ప్రేమ, అక్కర నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానినయ్యేలా చేసింది. సదా మీలాంటి సాహస యోధుడి ఆలోచనలకు, దృక్పథానికి సహచరుడినై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగనే మార్పు సాకారమై, తెలుగు రాష్ట్రాలకే కాక యావత్ భారతదేశానికి మేలు జరిగే దిశగా ఆ భగవంతుడు మిమ్మల్ని నడిపించాలని, మీకు శక్తి ప్రసాదించాలని ప్రార్థిస్తాను’’ అని సముద్రఖని రిప్లయ్ ఇచ్చారు.

ప్రస్తుతం వీరిద్దరి కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది. ‘వినోదాయ సితం’ తమిళ్ చిత్రానికి ఇది రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ లో సాయి ధరమ్ తేజ్ కూడా నటిస్తుండడం విశేషం. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తుండగా ..సముద్రఖని డైరెక్టర్.