డీజేపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన ..కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్‌ అరెస్ట్

వరంగల్‌లో కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై జరిగిన దాడి ఘటనపై మంగళవారం హైదరాబాద్ లోని డీజేపీ ఆఫీస్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన చేపట్టారు. దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున కార్య కర్తలు డీజీపీ ఆఫీస్‌లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్‌తో సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి , స్థానిక పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ ఘటనతో డీజీపీ ఆఫీస్ వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.

మరోపక్క తోట పవన్ పై దాడిని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఖండించారు. ఏకశీల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తోట పవన్ ను ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అరాచక శక్తులుగా మారారని రేవంత్ విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గూండాల పాలన సాగుతోందన్న ఆయన.. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆదేశాలతోనే తనపై దాడి జరిగినట్టు పవన్ చెప్పాడన్నారు. ఈ ఘటనపై డీజీపీ స్పందించాలని, క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, సీఎం దిష్టిబొమ్మలు దహనం చేయడంటూ పార్టీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.