పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైస్సార్సీపీ ఎమ్మెల్యే

ఒంగోలు పోలీసుల తీరుపై మాజీ మంత్రి, వైస్సార్సీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫేక్ డాక్యుమెంట్స్ స్కాం కేసులో పోలీసుల వ్యవహారశైలిపై మండిపడ్డ బాలినేని.. పోలీసుల తీరుకు నిరసనగా తన గన్‌మెన్‌లను ప్రభుత్వానికి తక్షణమే సరెండర్‌ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి లేఖ రాశారు.

ఈ కేసులో తమ పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టవద్దని ఇప్పటికే పలుమార్లు అధికారులను కోరిన బాలినేని.. అసలు దోషుల విషయంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి తీరును ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని అరెస్టు చేశారు పోలీసులు.. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టవద్దని మూడు రోజుల క్రితం కలెక్టర్‌ సమక్షంలో ఎస్పీని కోరారు బాలినేని.. పోలీసులు తన సూచనలను పట్టించుకోక పోవటంతో గన్‌మెన్‌లను సరెండర్‌ చేస్తున్నట్లు డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.