ఏపీ ప్రభుత్వంపై కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపణలు

కరెంటు మీటర్లలో వేల కోట్ల కుంభకోణం..ఒక్కో మీటర్ నిర్వహణకు రూ.35 వేలు

Kommareddy Pattabhiram

అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు కరెంటు మీటర్లు బిగించే పేరుతో రూ.వేల కోట్ల కుంభకోణానికి తెరలేపిందంటూ ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. ఒక్కో మీటర్ బిగించడం, తర్వాత దాని నిర్వహణకు రూ.35 వేల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రపంచంలో ఎక్కడా ఈ రేటు లేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన బినామీకే ఈ కాంట్రాక్టు అప్పగించారని ఆరోపించారు. ఈమేరకు అమరావతిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కాంట్రాక్టును షిర్డీ సాయి కంపెనీ దక్కించుకుంది. దీని నిర్వహణ వ్యవహారాలు చూస్తున్నది కడపకు చెందిన వ్యక్తులే.. ఇది జగన్ రెడ్డి బినామీ కంపెనీ. అందుకే చాలా ఎక్కువ రేటుకు ఈ కాంట్రాక్టును కట్టబెట్టారు. ఇందులో భారీగా అక్రమాలు జరిగాయని బయటపడడంతో టెండర్లు రద్దు చేశామంటూ మంత్రి పెద్దిరెడ్డి దబాయిస్తున్నాడు. ఈ నెల 12న ముఖ్యమంత్రి వద్ద జరిగిన సమీక్షలో మొత్తం 18 లక్షల మీటర్లకు రూ.ఆరున్నర వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆ ప్రకారం ఒకో మీటర్‌కు రూ.35 వేలు అవుతోంది. డబ్బుల కోసం కక్కుర్తిపడి అడ్డగోలుగా రేట్లు పెంచేశారు. టెండర్లు రద్దు చేశామని మంత్రి చెబుతుంటే టెండర్‌ దక్కించుకొన్న కంపెనీ ఇచ్చిన శాంపిల్‌ మీటర్లను పరీక్షకు పంపి వాటి ఫలితాలు కూడా తీసుకొన్నామని అధికారులు చెబుతున్నారు. తమ దొంగతనం బయటపడటంతో ప్రభుత్వం కంగారుపడుతోంది. ఈ ప్రభుత్వం అక్రమ సంపాదనకు ఎంత తెగించిందో చెప్పేందుకు ఈ వ్యవహారమే ఉదాహరణ’అని పట్టాభిరాం చెప్పారు.

రైతులను ముంచడానికే మోటార్లకు మీటర్లు పెడుతున్నారని పట్టాభిరాం ఆరోపించారు. రైతులకు సంబంధించిన బకాయిలను విద్యుత్ సంస్థలకు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ మీటర్ల రీడింగ్ ప్రకారం డబ్బులు ఇవ్వలేక ప్రభుత్వం చేతులెత్తేస్తుందని, అప్పుడు బిల్లులు చెల్లించాలంటూ రైతులపై విద్యుత్ అధికారులు ఒత్తిడి తీసుకొస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం చేయాలా.. చావాలా ? అంటూ కొమ్మారెడ్డి పట్టాభిరాం ప్రభుత్వంపై మండిపడ్డారు.