మరోసారి ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం
ఉత్తరకొరియా చర్యలు క్షమించరానివని జపాన్ ప్రధాని వ్యాఖ్య
north Korea test fires submarine-launched ballistic missile
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. జపాన్ తీరంలోకి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించినట్లు సమాచారం. దక్షిణ కొరియా, జపాన్ సైన్యం సంయుక్తంగా ఈ విషయాన్ని గుర్తించినట్లు ఆయా దేశాల అధికారుల తెలిపారు. తూర్పు తీరంలో ఉన్న పోర్ట్ ఆఫ్ సిన్పో నుంచి ఈ రోజు ఉదయం ఉత్తర కొరియా ఈ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. ఉత్తర కొరియా జలాంతర్గాములకు పోర్ట్ ఆఫ్ సిన్పో కీలక కేంద్రంగా ఉంది. దీన్ని సీ ఆఫ్ జపాన్గానూ పిలుస్తారు. ఆ ప్రాంతం మీదుగా క్షిపణులను పరీక్షించడం పట్ల జపాన్ ప్రధాని కిషిడా మండిపడ్డారు. రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పరీక్షించారని ఆయన కూడా చెప్పారు.
ఉత్తరకొరియా పాల్పడుతోన్న చర్యలు క్షమించరానివని విమార్శించారు. ఉత్తరకొరియా పాల్పడుతోన్న చర్యల గురించి చర్చించేందుకు సియోల్లో అమెరికా, జపాన్ దేశ ప్రతినిధులు సమావేశం కానున్నారు. ఇదే సమయంలో ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం గమనార్హం. కొన్ని రోజుల నుంచి ఇటీవల ఉత్తర కొరియా వరుసగా క్షిపణులను పరీక్షిస్తోంది. హైపర్ సోనిక్, లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లతో పాటు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లను కూడా ఉత్తరకొరియా పరీక్షించింది. అంతర్జాతీయ ఆంక్షలను లెక్కచేయకుండా ఉత్తర కొరియా ఈ చర్యలకు పాల్పడుతోంది. బాలిస్టిక్, న్యూక్లియర్ క్షిపణులను పరీక్షించకూడదని ఇప్పటికే ఉత్తర కొరియాపై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించిన విషయం తెలిసిందే.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/